పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా కీకారణ్యము. ధ్రువుని తల్లి సునీత. ధ్రువుని సవతి తల్లి ధ్రువుడు సింహాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతుంది. సునీత, ధ్రువుని పిలిచి నీవు సింహాసనం అధిష్టించి, రాజ్యపాలన చేయాలి. అందుకు శ్రీ మహా విష్ణువు దర్శన భాగ్యం కలగాలి. ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది. అందుచేత తపమాచరించి, విష్ణు దర్శనం పొంది, రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపుతుంది. అలా బయలుదేరిన ధ్రువుడు, ఈ కీకారణ్య ప్రదేశానికి చేరుకున్నాడు. అచ్చట శాండిల్య మహాముని ఆశ్రమం ఉంది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధ్రువుని చూచి, అతని మనసులోని కోరిక తెలిసినవాడై, ముని అతన్ని పిలిచి “నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ రూపం తలుచుకొంటూ తపస్సు చెయ్యి. స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పినారు. మునీశ్వరులు చెప్పినట్లుగా తపమాచరించుట మొదలుపెట్టినాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత, ధృవుని తపస్సుకి మెచ్చినవాడై విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూచి ధృవుడు భయపడ్డాడు. అంతట విష్ణువు “బాలక భయమెందుకు తత్తరపాటు చెందకు నేను నీ అంతే కదా ఉన్నాను” అని నవ్వుతూ పలుకటయే కాకుండా చెక్కిళ్ళు ఒత్తి భయము లేకుండా చేసాడు. స్వామి అక్కడే శిలారూపంలో వెలసినాడు....